ఆంధ్రప్రదేశ్

సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సభను జయప్రదం చేయాలి సీపీఐ(ఎం) బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ..!

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన మహానేత కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 12వ తేదీన కడప ఎస్పీ డిగ్రీ కాలేజీ వద్దగల ఉపాధ్యాయ భవన్‌లో నిర్వహించనున్న సంస్మరణ సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) బద్వేలు పట్టణ కమిటీ పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో సభకు సంబంధించిన కరపత్రాలను సీపీఐ(ఎం) నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కడప జిల్లా కమిటీ సభ్యులు పి. చాంద్ భాష మాట్లాడుతూ, సీతారాం ఏచూరి తన జీవితాన్ని ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంకితం చేశారని అన్నారు.

విద్యార్థి ఉద్యమం ద్వారా ప్రజా జీవితంలోకి వచ్చిన ఏచూరి, కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. దేశంలో మతతత్వ శక్తుల పెరుగుదలను వ్యతిరేకిస్తూ లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులోనూ, ప్రజా ఉద్యమాల్లోనూ తన వాణిని బలంగా వినిపించిన సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ సంస్మరణ సభకు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కామ్రేడ్ కందారపు మురళి ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించనున్నారు. ప్రజలు, కార్మికులు, యువత, పార్టీ అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) బద్వేలు పట్టణ కార్యదర్శి కె. శ్రీను, పట్టణ కమిటీ సభ్యులు సి. సుబ్బరాయుడు, పి. మోక్షమ్మ, శాఖా కార్యదర్శులు బాలమ్మ, కొండయ్య, శ్రీనివాసులు, పార్టీ సభ్యులు రోజమ్మ, ఓబులేసు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.