భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్‌కు మరో కీలక బాధ్యత దక్కింది. ఆయనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బోర్డులో పార్ట్‌టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం 2026 ఆగస్టు 20 నుంచి అమల్లోకి రానుండగా.. నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఇదే సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్రాను కూడా RBI సెంట్రల్ బోర్డులో నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా పునర్నియమించారు. వీరితో పాటు రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది కూడా బోర్డులో సభ్యులుగా కొనసాగుతున్నారు.
RBI సెంట్రల్ బోర్డులో గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సేవల శాఖల కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉంటారు. దేశ ఆర్థిక, ద్రవ్య విధానాలకు సంబంధించిన కీలక అంశాలపై RBI సెంట్రల్ బోర్డు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.
ISRO చైర్మన్‌గా దేశ అంతరిక్ష రంగంలో కీలక మైలురాళ్లను అధిగమించిన ఎస్. సోమనాథ్‌కు RBI సెంట్రల్ బోర్డులో చోటు కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాంకేతిక, పరిపాలనా రంగాల్లో ఆయనకున్న విస్తృత అనుభవం ఈ కొత్త బాధ్యతలోనూ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.