జగ్గయ్యపేట,సెప్టెంబర్ 6: జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందన్న అంశం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వివిధ పదవుల్లో కూటమి భాగస్వామ్య పార్టీలకు ప్రాధాన్యం లభిస్తున్న నేపథ్యంలో, ఈసారి జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వంలో పదవుల విషయంలో టీడీపీకి అధిక ప్రాధాన్యం దక్కిందన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో, జనసేనకు కూడా అవకాశం కల్పించాలనే ఆలోచనలో భాగంగానే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ పదవిపై చర్చ జరుగుతోందా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు చైర్మన్ పదవిపై టీడీపీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. మున్సిపల్ రాజకీయాల్లో తమ బలం,కౌన్సిలర్ల సమీకరణాలు తదితర అంశాల ఆధారంగా పదవి తమకే కొనసాగుతుందన్న అంచనాలు కొందరు నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ–జనసేన మధ్య చైర్మన్ పదవి అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కూడా కూటమి పార్టీల మధ్య జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల మధ్య ఏదైనా విభేదం ఏర్పడితే మున్సిపల్ రాజకీయాల్లో దాని ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనూ లెక్కలు మొదలయ్యాయని సమాచారం.
ఒకవైపు టీడీపీ,మరోవైపు జనసేన.. మధ్యలో వైఎస్ఆర్సీపీ వ్యూహాలు.. ఇలా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ పదవి చుట్టూ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
జనసేనకు చైర్మన్ పదవి కేటాయించే విషయంపై కూటమి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారా ? లేక ఇది కేవలం స్థానికంగా జరుగుతున్న ప్రచారమేనా ? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎవరికి పదవి ఖరారైందని చెప్పే పరిస్థితి లేకపోయినా,జనసేనకు చైర్మన్ పీఠం దక్కనుందన్న ప్రచారం మాత్రం జగ్గయ్యపేట రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
చివరకు కూటమి అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? టీడీపీకి కొనసాగింపునిస్తుందా ? లేక జనసేనకు అవకాశం కల్పిస్తుందా ? అన్నది వేచి చూడాల్సిందే.