డీఎస్సీ నియామకాల వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తుతున్నా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
ప్రశ్నించిన ప్రతిసారీ ప్రభుత్వం గింజుకుంటోందని, అయితే డీఎస్సీ నియామకాల్లో జరిగిన తప్పులను మాత్రం అంగీకరించడం లేదని జగన్ అన్నారు. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీలో మాట్లాడుతున్న ప్రభుత్వం శాసనమండలిలో మాత్రం ఈ అంశంపై ఎందుకు చర్చకు ముందుకు రావడం లేదని జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్షం తమ తప్పులను ఎత్తిచూపుతుందనే భయంతోనే మండలిలో చర్చకు ప్రభుత్వం వెనుకాడుతోందని ఆయన ఆరోపించారు.
డీఎస్సీ నియామకాలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు, నియామక ప్రక్రియపై సమగ్రంగా చర్చించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని జగన్ డిమాండ్ చేశారు.