ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా

అమరావతి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వారి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి, గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడు, సంబంధిత అధికారులతో చంద్రబాబు మాట్లాడారు.

మరోవైపు, గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డ్‌, మెరైన్‌ పోలీస్‌ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. రెండు డార్నియర్‌ విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో ఏడు బోట్లను రంగంలోకి దించి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. సముద్రంలో వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తూ మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.