ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు రాయలసీమ అభివృద్ధి నిరోధకుడు: సాకే శైలజనాథ్

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన ఆయన.. చంద్రబాబును రాయలసీమ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా అభివర్ణించారు.

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నీటితో నిండివున్నప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శైలజనాథ్ మండిపడ్డారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రాయలసీమకు సాగునీటి హక్కుల సాధన కోసం ఈ నెల 24న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రజా పోరాటానికి దిగనున్నట్లు సాకే శైలజనాథ్ ప్రకటించారు. రాయలసీమ ప్రయోజనాల కోసం ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.