జాతీయం

E20పై వెనక్కి తగ్గుతున్న కేంద్రం…?

E20 పెట్రోల్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. E20తో పాటు E10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచే అంశంపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ వినియోగంపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2023కు ముందు తయారైన కొన్ని వాహనాల్లో E20 ఇంధనం వల్ల ఇంజిన్‌ పనితీరు, మైలేజ్‌, ఇతర భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ అనంత నాగేశ్వరన్‌ కీలక అభిప్రాయం వ్యక్తం చేశారు. E20 పెట్రోల్‌తో పాటు E10 పెట్రోల్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం గురించి పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.ఈ సూచన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం E20 విధానంపై సాధ్యాసాధ్యాలను మరోసారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాత వాహనాలను వినియోగిస్తున్న వారికి ఇబ్బందులు లేకుండా, కొత్త వాహనాల్లో E20 వినియోగాన్ని కొనసాగించేలా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే E10 పెట్రోల్‌ అందుబాటులోకి వస్తుందా? ఎక్కడ, ఏ విధంగా విక్రయిస్తారు? అనే అంశాలపై కేంద్రం నుంచి ఇంకా అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. కేంద్రం తీసుకునే తుది నిర్ణయంపై వాహనదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.