సినిమా

అగ్ని పరీక్ష 2 | కంటెస్టెంట్లపై జడ్జీల తీరు.. నెటిజన్ల ఆగ్రహం

స్టార్ మా, జియో హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ‘అగ్ని పరీక్ష 2’ తాజా ఎపిసోడ్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల పట్ల న్యాయనిర్ణేతలు వ్యవహరించిన తీరుపై పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఎపిసోడ్‌లో మోడల్ అపూర్వ తన అభిప్రాయాన్ని వెల్లడించిన సందర్భంలో అభిజిత్, బిందు మాధవి ఆమెకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పిన కంటెస్టెంట్‌కు రెడ్ ఫ్లాగ్ ఇవ్వడం సరైన నిర్ణయమేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు కంటెస్టెంట్ రోహిత్ నాయుడు విషయంలోనూ జడ్జీల నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. బిందు మాధవి అతడిని ట్రిగ్గర్ చేసేందుకు నీళ్లు కొట్టినప్పటికీ, రోహిత్ ఎలాంటి స్పందన చూపలేదు. దీంతో బిందు మాధవి అతడికి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. నవదీప్ కూడా రోహిత్‌కు రెడ్ ఫ్లాగ్ ఇవ్వగా, అభిజిత్ మాత్రం గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి అతడిని ప్రోత్సహించారు.

ఒకే సందర్భంలో జడ్జీల నుంచి భిన్నమైన నిర్ణయాలు రావడం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో సోషల్ మీడియాలో ‘జడ్జింగ్ న్యాయంగా జరుగుతోందా?’ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ షోలో జడ్జీల నిర్ణయాలు, కంటెస్టెంట్ల ప్రతిస్పందనలు ఎపిసోడ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి.

విమర్శలు, వాదోపవాదాలతో ప్రస్తుతం ‘అగ్ని పరీక్ష 2’ ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది. ఈ ఎపిసోడ్‌ను మంగళవారం రాత్రి 10 గంటలకు స్టార్ మాలో వీక్షించవచ్చు. జియో హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.