అంతర్జాతీయం

శిథిలాల కింద మూడు రోజులు.. ఆరేళ్ల బాలికను ప్రాణాలతో రక్షించిన బలగాలు

నేపాల్: వరదలు, కొండచరియల విరిగిపడటంతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌లో ఓ ఆరేళ్ల బాలికను సహాయక బలగాలు ప్రాణాలతో రక్షించాయి. రుసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వరదల కారణంగా మట్టి, శిథిలాల కింద బాలిక చిక్కుకుపోయింది. దాదాపు మూడు రోజుల పాటు ఆమె అదే పరిస్థితిలో ఉండిపోయింది. సహాయక చర్యల్లో భాగంగా శిథిలాలను తొలగిస్తున్న సాయుధ పోలీసు బలగాలకు చిన్నారి ఏడుపు వినిపించింది.

అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. శిథిలాలను జాగ్రత్తగా తొలగిస్తూ చివరకు బాలిక ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అనంతరం ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

మూడు రోజుల పాటు శిథిలాల కింద ఉన్నప్పటికీ బాలిక ప్రాణాలతో బయటపడటం స్థానికుల్లో ఉపశమనం కలిగించింది. రెస్క్యూ అనంతరం బాలికను మెరుగైన వైద్యం కోసం కాఠ్మాండు ఆస్పత్రికి తరలించారు.

ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక బలగాలు చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో చిన్నారి ప్రాణాలతో బయటపడటం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది.