అల్లూరి సీతారామరాజు జిల్లా: కనీస రహదారి సదుపాయం కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఓ గిరిజన గ్రామ ప్రజలు వినూత్న నిరసనకు దిగారు. ప్రభుత్వం రోడ్డు నిర్మించకపోవడంతో ఇక తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలంటూ పలుగు, పార చేతబట్టి రహదారి పనులను చేపట్టారు.
జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని గాడిగుంట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దశాబ్దాలుగా రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, అత్యవసర సమయాల్లో రాకపోకలు కూడా కష్టతరంగా మారుతున్నాయని తెలిపారు.
తాము గత 30 ఏళ్లుగా టీడీపీకి ఓటు వేస్తున్నప్పటికీ, తమ గ్రామానికి మాత్రం కనీస రహదారి సౌకర్యం కల్పించలేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు.
దీంతో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ గ్రామస్తులే రహదారి పనుల్లోకి దిగారు. పలుగు, పార పట్టుకుని రోడ్డుపై ఉన్న మట్టి, రాళ్లను తొలగిస్తూ రహదారిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
“ప్రభుత్వం ఇకనైనా స్పందించి పూర్తి స్థాయిలో రహదారి నిర్మించాలి. లేకపోతే రాబోయే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తాం” అని గ్రామస్తులు హెచ్చరించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామానికి శాశ్వత రహదారి నిర్మించాలని, ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు.