విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. టెట్ (TET) పరీక్షలో అర్హత సాధించలేదనే మనస్తాపంతో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామానికి చెందిన తనూజ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తనూజకు వివాహమై కేవలం 50 రోజులు మాత్రమే కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. టెట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఆమె కొంతకాలంగా మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతర వ్యక్తిగత సమస్యలు ఏవీ లేవని, పరీక్షలో అర్హత సాధించలేకపోవడమే ఆత్మహత్యకు కారణమని తనూజ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పెదమానాపురం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నవ వధువు అకాల మరణంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.