జాతీయం

ప్రియుడితో కలిసి భర్తకు జ్యూస్‌లో విషం..

జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగుచూసిన ఓ హత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం చివరకు భర్త హత్యకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. 27 ఏళ్ల మహేష్ మీనా అనే వ్యక్తిని అతడి భార్య కవిత (23), ఆమె ప్రియుడు గణేష్ కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మహేష్‌కు మందులు అవసరమంటూ అతడిని కవిత బయటకు తీసుకెళ్లింది. అనంతరం గణేష్‌తో కలిసి జ్యూస్‌లో విషపదార్థం కలిపి మహేష్‌కు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. విష ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహేష్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

హత్య అనంతరం మహేష్ అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను నమ్మించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే మహేష్ మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం కలగడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పలు కోణాల్లో ఆధారాలను సేకరించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. ఈ క్రమంలో కవిత, గణేష్ మధ్య ఉన్న సంబంధం, మహేష్ మృతికి ముందు జరిగిన పరిణామాలపై కీలక ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.

సేకరించిన ఆధారాల ఆధారంగా పోలీసులు కవిత, గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

కుటుంబ సభ్యుల అనుమానం, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు కలిసి ఈ కేసులో దాగి ఉన్న నిజాన్ని బయటకు తీసుకురావడం గమనార్హం