ఫంక్షన్లు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో పేపర్ ప్లేట్ల వినియోగాన్ని తగ్గించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు సూచించారు. హనుమకొండ జిల్లా కేశవాపూర్ గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పల్లెకు పొన్నమన్న’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పేపర్ ప్లేట్లకు బదులుగా పునర్వినియోగం చేసుకునే స్టీల్ ప్లేట్లను ఉపయోగించడం మంచిదని మంత్రి సూచించారు. పేపర్ ప్లేట్ల వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్లాస్టిక్ వినియోగించే వారికి అవసరమైతే జరిమానాలు విధించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.