ప్రధానమంత్రి ముద్రా యోజన (PMMY) కింద మహిళలకు రూ.20 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇచ్చింది. రూ.3,250 చెల్లిస్తే రూ.20 లక్షల రుణం మంజూరవుతుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది.
ఇటీవల ఈ ప్రచారానికి సంబంధించిన కొన్ని అగ్రిమెంట్ కాపీలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని కొందరు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పత్రాలకు ప్రభుత్వ పథకంతో ఎలాంటి సంబంధం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
లోన్ కోసం ఎలాంటి ఛార్జీలు లేవు
ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణం మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి రుసుమును వసూలు చేయదని PIB తెలిపింది. అర్హత ఉన్న దరఖాస్తుదారులకు బ్యాంకులు, సంబంధిత ఆర్థిక సంస్థలు నిబంధనల ప్రకారం రుణాలను మంజూరు చేస్తాయి.
రూ.3,250 చెల్లిస్తే రూ.20 లక్షల రుణం ఖాయమంటూ వచ్చే సందేశాలు, అగ్రిమెంట్లు లేదా ఇతర పత్రాలను నమ్మి డబ్బులు చెల్లించవద్దని ప్రజలకు సూచించింది.
వైరల్ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ పథకాల పేరుతో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలు, రుణ ఆఫర్లు, అగ్రిమెంట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని PIB సూచించింది. ముఖ్యంగా రుణం మంజూరు చేస్తామని ముందుగా డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులు లేదా సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
అందువల్ల “రూ.3,250 చెల్లిస్తే రూ.20 లక్షల ముద్రా రుణం” అనే ప్రచారాన్ని నమ్మవద్దని, అధికారిక ప్రభుత్వ లేదా బ్యాంకింగ్ మార్గాల ద్వారానే పథకం వివరాలను నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.